ప్రధాని నరేంద్రమోడీ సందేశం వస్తుంది అంటే ఎవరైనా ఏం ఆశిస్తారు…? అందులోనూ కరోనా వైరస్ రక్కసి కాటేస్తున్న దశలో మోడీ నుండి జనం ఏం ఆశిస్తారు…? సగటు భారతీయున్ని మోడీ మళ్లీ నిరాశపర్చారా…?
ప్రధాని సందేశం అనగానే జనం అంతా టీవీలకు అతుక్కుపోయారు. లాక్ డౌన్ పై మోడీ ఏదైనా కొత్త విషయం చెబుతారా…? లాక్ డౌన్ ఎత్తేస్తున్నామనే గుడ్ న్యూస్ ఉంటుందా..? కరోనా కట్టడికి ఆర్మీ బలగాలను దింపుతారా…? బాధ్యత లేకుండా రోడ్లపై తిరుగున్న జనానికి మోడీ హెచ్చరికలుంటాయా…? ఇలా అనేక ఆశలతో ఉన్న భారతీయులను మోడీ నిరుత్సాహాపర్చారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కరోనా చీకట్లను పారద్రోలుతూ… యావత్ భారత దేశం ఐక్యంగా ఉన్నామనే సందేశం మంచిదే. కానీ కేవలం ఆ సందేశం ఒక్కటే మనల్ని కాపాడుతుందా…? ఇంకా ఎన్నాళ్లు ఈ గృహానిర్బంధం అని ఎదురు చూస్తున్న సగటు కష్టజీవికి ఊరటనిస్తుందా అంటే ఖచ్చితంగా లేదని, మోడీ దేశ ప్రజలను నిరూత్సాహా పర్చారని మేధావులు విమర్శిస్తున్నారు.
దేశంలో వైద్య పరికరాల కొరత ఉంది. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. వారికి ప్రత్యేకించి ఏదైనా సహాయం చేస్తారా అన్న అంశాలేవీ లేవు. అంతేకాదు… ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు కావచ్చు, రాబోయే కాలంలో తీసుకోబోయే చర్యలు కావచ్చు… సగటు వేతన జీవి కష్టనష్టాలు కావచ్చు… ఏవీ మోడీ సందేశంలో లేకపోవటం చర్చనీయాంశం అవుతున్నాయి.