రమణదీక్షితులు… అవును. గతంలో తిరుపతి వెంకన్న స్వామి వారి ఆలయ ప్రధాన పూజారి. అయితే, వయస్సుతో సంబంధం లేకుండా స్వామి వారికి సేవ చేసుకునే అవకాశం ఉండేది. అయితే, అందరికీ స్వామివారి సేవ కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం వంశపారంపర్య హక్కులను పక్కనపెడుతూ నిర్ణయం తీసుకుంది.
అయితే, అప్పట్లో రమణదీక్షితులు ప్రభుత్వం పై పోరాటం చేసినా.. కోర్టులకు వెళ్లినా ఊరట లభించలేదు. ఎన్నికలకు ముందే రమణదీక్షితులు పాదయాత్ర చేస్తోన్న జగన్‌ను కలిసి, వంశపారంపర్య హక్కులను పునరుద్దరించేలా ప్రయత్నించాలని కోరారు. దాంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వం వంశపారంపర్యంగా హక్కులను కొనసాగిస్తూ, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలుపుదల చేసింది.
కోటి రూపాయలకు పైగా ఆదాయం ఉన్న ప్రధాన ఆలయాలతో పాటు, వార్షికాదాయం అంతంత మాత్రమే ఉన్న గుడులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. హుండీ, టికెట్లు, తీర్థ ప్రసాదాల ద్వారా ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తోన్న సింహాచలం, విజయవాడ కనక దుర్గమ్మ, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయాల్లో వంశపారంపర్య హక్కులను పునరుద్ధరించింది ఏపీ ప్రభుత్వం.
కానీ ఇప్పుడు విడుదల చేసిన జీవో తిరుమల తిరుపతి దేవస్థానానికి వర్తిస్తుందా లేదా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. టీటీడీ ప్రత్యేక సంస్థగా ఉన్నందున బోర్డు ద్వారా నిర్ణయం తీసుకోవాలా… లేక ప్రభుత్వం కోటి ఆదాయం మించిన అన్ని దేవాలయాలకు వర్తిస్తుంది అని చెప్పినందున తిరుమలకు కూడా వర్తిస్తుందా అన్న అంశంపై క్లారిటీ లేదు.
అయితే, తిరుమలకు కూడా వర్తిస్తే మాత్రం.. అప్పట్లో చంద్రబాబును తిట్టిపోసిన రమణదీక్షితులకు సీఎం జగన్ అందలం ఎక్కించినట్లు అవుతుంది.