రేవంత్ రెడ్డి అంత మొనగాడా? మళ్లీ రెడ్డిలకేనా పదవి? అసలు అధ్యక్షుడయ్యేంత అర్హత ఆయనకు ఎక్కడిది? వచ్చి పదేండ్లు గూడా గాలే.. అప్పుడే పార్టీని అప్పజెప్తారా?.. ఇవీ రెండు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతల ప్రశ్నలు, నిలదీతలు. పార్టీలో ఎందరో ఉద్దండులు ఉంటే.. రేవంత్ రెడ్డికే పీసీసీ ఎందుకు ఇచ్చారో అర్థం కాక ఢిల్లీలో కూడా కొందరు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారట. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఏ రాష్ట్రంలో , ఏ నేత కూడా పీసీసీ చీఫ్ అయిన చరిత్ర లేకపోవడంతో రేవంత్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే అధిష్టానం మాత్రం పక్కా లెక్కలు గట్టి.. అసంతృప్తుల అభ్యంతరాలను పక్కనబెట్టి, ఏరికోరి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసుకుందని ఢిల్లీ పెద్దలు చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలను కూడా వారే విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఎదురులేని నేతగా ఎదిగారు. రాజకీయ ప్రత్యర్థులు, రహస్య మిత్రులే తప్ప.. ఆయన తప్పులను వేలెత్తి చూపే శత్రువులే లేకుండా పోయారు. అసలు కేసీఆర్‌ను ఢీకొట్టే మొనగాడు ఎవరైనా ఉన్నారా? అంత దమ్ము ఎవరికైనా ఉందా? అని భూతద్దం పెట్టి వెతికినా అలాంటివారెవరూ కనబడని పరిస్థితి కూడా వచ్చింది. అలా రాష్ట్రంలో ప్రతిపక్షాలని తొక్కేసి.. ఆ మాటకొస్తే మరో ప్రత్యామ్నాయమన్నదే లేకుండా, రాకుండా కేసీఆర్ ఆడిన రాజకీయ చదరంగంలో ఆయన పాచిక పారని శత్రువే రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్‌కు కొడంగల్ రూపంలో కొరకరాని కొయ్యగా తయారయ్యారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా.. అందులోని తప్పులని ఎత్తిచూపుతూ ఇంటా( అసెంబ్లీలో), బయటా పంటికింది రాయిలా మారారు. ఫలితం రేవంత్‌తో ఉన్న రాజకీయ వైరం కాస్తా.. కేసీఆర్‌కు వ్యక్తిగత శత్రుత్వంగా మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
రేవంత్ రెడ్డిని రాజకీయంగా బలహీనపరిచేందుకు చేసే ప్రయత్నంలో కేసీఆర్‌కు.. పరిస్థితులు కూడా చాలా కలిసొచ్చాయి.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించండంతో దాదాపుగా ఆయన చాప్టర్ క్లోజ్ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. కానీ జైలులో రేవంత్ రెడ్డి మరింత మొండిగా తయారయ్యారు. జైలు నుంచి విడుదలవుతూ ఎప్పటికైనా కేసీఆర్‌ను చిప్పకూడు తినిపిస్తానంటూ ఘాటుగా శపథం చేసి.. ఇక అదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ తప్పులని, తప్పిదాలని ఎండగడుతూ కేసీఆర్‌కు నీడలా వెంటాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అర్ధరాత్రి ఇంటి బెడ్‌రూమ్ తలుపులు పగలగొట్టి మరీ అరెస్ట్ చేసేంతలా.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి రోడ్డుకీచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఏ నేత, ఏ పార్టీ కూడా రేవంత్ రెడ్డిలా.. కేసీఆర్‌కు ఎదురు తిరిగింది లేదు. ఇప్పుడు కేసీఆర్‌పై నిలువెల్లా నిప్పులు కక్కుతున్న బీజేపీ కూడా.. మొన్నటి దాకా అలయ్ బలయ్ చేసుకున్న పార్టీనే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చేదాకా కూడా ఆ పార్టీలో కేసీఆర్‌కు కోవర్డులు కోకొల్లలు.
వాస్తవానికి ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వానికి పడిన ప్రతి వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు పడాల్సిందే. ప్రభుత్వం వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎండగడితే.. ఓట్ల రూపంలో దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాగు టీఆర్ఎస్‌లోకి వెళ్తారనే బలమైన ముద్ర ప్రజల్లో పడి ఉండటంతో.. ఆ వ్యతిరేక ఓట్లు అన్నీ కూడా కమలం ఖాతాలో పడ్డాయి. కానీ రేవంత్ రెడ్డి చేతికి వచ్చాక.. కచ్చితంగా టీఆర్ఎస్, కేసీఆర్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయన్నది విశ్లేషకుల మాట.
కేసీఆర్‌కు అసలు సిసలైన యాంటీ లీడర్ కనుకే.. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చింది. ఇదే అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం జనాల్లోకి తీసుకెళ్తే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం అంత పెద్ద టాస్క్ ఏం కాకపోవచ్చనని విశ్లేషకులు చెబుతున్నారు.