– ఏపీలో పోస్టింగ్ ఇవ్వకపోవడానికి కారణమేంటి?
– వీఆర్ఎస్ కి అప్లయ్ చేసుకున్నారా?
– మళ్లీ తెలంగాణకు వస్తున్నారా?
– స్పెషల్ సెక్రెటరీనా? లేక, సలహాదారుడిగానా?
– బీఆర్కే భవన్ లో 10వ అంతస్తు ఎవరి కోసం?
– బిహారీ అధికారులపై అమితమైన ప్రేమ ఎందుకో?
– సోమేష్ రెవెన్యూ మార్క్ పైనే కేసీఆర్ దృష్టి?
క్రైంబ్యూరో, తొలివెలుగు:మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గత మూడేళ్లుగా తెలంగాణపై తనదైన పాలన కొనసాగించారు. ఎంతగా అంటే విపక్షాలు సీఎం మూలాలు బిహార్ లో ఉన్నాయనేంతగా. ఐఏఎస్, ఐపీఎస్ ల కీలక పోస్టింగ్స్ ఆ రాష్ట్రానికి చెందినవారికే ఇప్పించడంలో ఈయన కీలక భూమిక పోషిస్తారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో అర్ధాంతరంగా ఏపీకి వెళ్లిన సోమేష్ కుమార్ కు అక్కడ పనిచేయడం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. దీంతో పదవీకాలం ముగయకుండానే ముందస్తుగా రాజీనామా ఏపీ ప్రభుత్వానికి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో 10 రోజుల్లో ఓ స్పష్టత రానుంది. అప్పటివరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే ఉంచుతున్నట్లు సమాచారం. రాజీనామా ఆమోదముద్ర పడగానే తెలంగాణ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ లోకి వస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పదవీ విరమణ అయిపోయిన ముగ్గురు ఐఏఏస్ లు కమిషనర్స్ గా కొనసాగుతున్నారు. వారి లాగానే స్పెషల్ సెక్రెటరీ కోటాలో కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
రెవెన్యూలే కీలకం
సోమేష్ కుమార్ ఆదాయం తెచ్చిపెట్టడంలో దిట్ట. ఎక్సైజ్ కమిషనర్ గా ఆ ముద్ర వేసుకున్నారు. రెవెన్యూ శాఖలో భూముల ప్రక్షాళన చేసి రెవెన్యూ సంపాదించారని ప్రభుత్వం భావిస్తోంది. వివాదాస్పద భూములను ప్రభుత్వ పెద్దల బినామీలకు ఎలా క్లియర్ చేయాలో ఈ అధికారి, ఈయన శిష్యులకు తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియదని ఆరోపణలు ఉన్నాయి. ఇలా అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి లాయల్ గా ఉండే అధికారి రెవెన్యూ శాఖలో కీలక పదవికి అవసరం. అందుకే, సోమేష్ కుమార్ తెలంగాణకు వచ్చేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కేసీఆర్ ఓకే చెప్పడంతో వాలెంటరీ రిటైర్మెంట్ కి అప్లయ్ చేసుకున్నారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పదో అంతస్తు రెడీ
ప్రస్తుత సచివాలయం బీఆర్కే భవన్ లోని 10వ అంతస్తుకు మెరుగులు దిద్దుతున్నారు. కొత్త సచివాలయం ఓపెన్ చేసినా అన్నీ సర్దుకునే సరికి కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల్లో అత్యంత వేగంగా మార్పులు జరగాలని 10వ అంతస్తును సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. మొన్నటిదాకా సోమేష్ ఉన్న ఛాంబర్ లో ప్రస్తుత సీఎస్ ఉంటున్నారు. ఆయన వస్తే నేరుగా 10వ అంతస్తుకి తీసుకెళ్లేలా రెడీ చేసుకుంటున్నారట.
బీఆర్ఎస్ కి పనికొస్తారా?
సోమేష్ కుమార్ కి బిహార్ లోని రాజకీయలపై పట్టు ఉంది. ప్రశాంత్ కిషోర్ తో గంటల కొద్దీ మాట్లాడే చనువు ఉంది. దేశ రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. సర్వేల ఇన్ పుట్స్ ఎప్పటికప్పుడు కేసీఆర్ కి చేరవేయగలరు. పార్లమెంట్ ఎన్నికల వరకు బిహార్ లోని వైశాలీ స్థానానికి బరిలో దింపేలా ప్లాన్స్ వేసుకోవచ్చనే ఉద్దేశంతో సోమేష్ కుమార్ ని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.