హీరోలకు ఇమేజ్ అనేది ఎంత కిక్ ఇస్తుందో, అంతే ప్రమాదకారి కూడా. ఆ ఇమేజ్ దాటి బయటకొచ్చి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామంటే కుదరని పని. ఈ విషయంలో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు చాలామంది ఫ్లాపులు చూశారు. తమకున్న ఇమేజ్ చట్రంలోనే సినిమాలు చేస్తూ కెరీర్ ను లాగించేస్తూ ఉంటారు. శ్రీవిష్ణుకు కూడా ఓ ఇమేజ్ ఉంది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నట్టున్నాడు ఈ నటుడు.
శ్రీవిష్ణు సినిమాల్లో కథలు బాగుంటాయి. అందులో శ్రీవిష్ణు ఓ హీరోగా కాకుండా, ఓ నటుడిగా మాత్రమే కనిపిస్తాడు. పైగా అతడి సినిమాల్లో భావోద్వేగాలు మనసుకు హత్తుకుంటాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు స్టోరీ సెలక్షన్ ను ఇష్టపడే జనాలు చాలామంది ఉన్నారు. ఇలాంటి హీరో ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
మొన్నటికిమొన్న అర్జున-ఫాల్గుణ సినిమా చేశాడు శ్రీవిష్ణు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయినప్పటికీ, అందులో కష్టపడి యాక్షన్ సీన్లు, ఛేజ్ లు ఇరికించారు. వాటిలో శ్రీవిష్ణును మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. ఇప్పుడు భళా తందనాన సినిమాతో మరోసారి అదే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో శ్రీవిష్ణు రెగ్యులర్ మార్క్ కంటే, మాస్ ఇమేజ్ ను ఎక్కువగా హైలెట్ చేసే ప్రయత్నం జరిగింది. శ్రీవిష్ణు గన్ పట్టుకొని కాల్చడం, మాస్ డైలాగ్స్ చెప్పడం లాంటివి టీజర్ లో ఉన్నాయి. మాస్ ఇమేజ్ కోసం శ్రీవిష్ణు చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి. తన ఇమేజ్ ను వదించుకొని, మాస్ ఇమేజ్ ను అందుకోవడంలో శ్రీవిష్ణు సక్సెస్ అయితే ఇక అతడికి తిరుగుండదు.