జూబ్లీహిల్స్ కారు బీభత్సం కేసులో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు తనది కాదంటూ ఎమ్మెల్యే షకీల్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని తెలుస్తోంది.
ఆ కారును మిర్జా ఇన్ ఫ్రా కంపెనీ పేరు మీద ఎమ్మెల్యే షకీల్ కొనుగోలు చేసినట్టు సమాచారం. మీర్జా ఇన్ ఫ్రా కంపెనీలో ప్రస్తుతం ఆయన భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తోంది.
కారు తనదేనని, అయితే ప్రమాదంతో తనకు ఏ మాత్రమూ సంబంధం లేదని ఎమ్మెల్యే షకీల్ చెబుతున్నారు. తను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్టు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వేగంగా వస్తున్న కారు బ్రిడ్జి దిగగానే అదుపు తప్పింది. వెంటనే అక్కడ పిల్లలను ఎత్తుకొని బుడగలు విక్రయిస్తున్న ముగ్గురు మహిళలను ఢీ కొట్టింది.
దీంతో అందులో ఒక మహిళ చేతిలో ఉన్న రెండేండ్ల బాబు కింద పడి మృతి చెందాడు. దీంతో డ్రైవర్ వెంటనే భయంతో అక్కడి నుంచి పారి పోయాడు. కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.