ఎన్టీఆర్ అనగానే పౌరాణిక పాత్రలు మన కళ్ళ ముందు కనపడతాయి. ఎన్నో సినిమాల్లో ఆయన అందమైన పాత్రలు పోషించి అలరించారు. ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తు ఉంటుంది. కృష్ణుడు, యముడు, రాముడు ఇలా ఆయన ఏ పాత్ర చేసినా సూపర్ హిట్ అవుతుంది. అయితే ఆయన తాను పౌరాణిక పాత్రలు పోషించిన ఆభరణాలను చాలా జాగ్రత్తగా దాచారు. దీనిపై ఆయన ఒక సందర్భంలో అసలు విషయం చెప్పారు.
1955లో జై సింహా సినిమాలో ఓ సన్నివేశంలో తాను అర్జున పాత్రలో నటించాను అని… తన పౌరాణిక పాత్రలకు అది తొలిమెట్టు అని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఆ పాత్ర ధరించిన తర్వాతే పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం చేయాలన్న కోరిక తనలో కలిగిందని పేర్కొన్నారు. పౌరాణిక పాత్రలు ధరించి కాస్త గుర్తింపు వచ్చాక వాటిపై స్పెషల్ గా ఏదైనా చేయాలని ఆలోచన కలిగిందన్నారు. తన పరిశోధనకు అదే నాంది పలికిందని పేర్కొన్నారు.
ఆనాటి నుంచి ఆయన సినిమాలు నటించడం ఆపేసే వరకు ఎంతో మంది కళా దర్శకులు అద్భుతంగా రూపొందించిన ఆభరణాలను, కిరీటాలను భద్రపరుస్తూ వచ్చానని గుర్తు చేసుకున్నారు. అందులో కొన్నింటిని తానే దగ్గర ఉండి తయారు చేయించుకున్నాను అని పేర్కొన్నారు. వాటిని జాగ్రత్త చేసి ముందు తరాలకు అందించకపోతే నా అభిరుచి వారికి ఎలా తెలుస్తుంది అని దాచినట్టు చెప్పారు.
తెలుగు సినిమా వజ్రోత్సవంలో వీటిని ప్రదర్శించారు. అలాగే ఆయన ఆసక్తికర విషయం చెప్పారు. కంటికి రెప్పలా వాటిని కాపాడుకుంటూ వచ్చానని అన్నారు. వాటిని చూస్తున్నప్పుడు ఒక్కో కిరీటం, ఒక్కో గద తనలోని కళాకారున్ని తట్టి లేపుతుందని పేర్కొన్నారు. తనను తన్మయానికి గురి చేస్తుందని, ఖరీదు కట్టలేని ఈ అపురూప ఆభరణాలను చూస్తుంటే ఆనాటి పౌరాణిక వైభవం ఒక్కసారి కళ్ళల్లో అలా కదలాడుతుందన్నారు.