తెలంగాణలో మరోసారి విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఎగ్జామ్స్ ఉంటాయా లేదా అన్న విషయం తెలియక అని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
పదో తరగతి పరీక్షలక ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మే 17 నుంచి 26 వరకు జరుగుతాయని ప్రకటించింది . ఇక ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. స్కూళ్లు, కాలేజీలు చాలా రోజుల పాటు మూసివేసే ఉండటంతో.. ఈ ఏడాది సిలబస్‌ను 30 శాతం వరకు తగ్గిస్తూనే.. పరీక్ష పేపర్లలో ఛాయిస్‌ల చాన్స్‌ను పెంచారు. కానీ 30 శాతం సిలబస్‌ను తగ్గించినా.. ప్రస్తుతం అది కూడా పూర్తి కాలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా విద్యాసంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. పరీక్షలు ఉంటాయా లేక ఈ ఏడాది కూడా ప్రమోట్ చేస్తారా అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు పరీక్షల నిర్వహణపై తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం నెలన్నర రోజులే ప్రత్యక్ష తరగతులు నిర్వహించి.. వార్షిక పరీక్షలు నిర్వహిస్తే ఎలా కొందరు అభిప్రాయపడుతోంటే.. మరికొందరు మాత్రం పరీక్షలు లేకుండా ప్రమోట్ చేస్తే.. విద్యార్థుల్లో నైపుణ్యత కొరవడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టెన్త్, అలాగే ఇంటర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే బాగుండేదని చెప్తున్నారు.