– ఇన్నాళ్లూ కేంద్ర బిల్లులకు మద్దతు
– ఇప్పుడేమో ఢీ అంటే ఢీ
– బీజేపీ సర్కార్ లో అవినీతి జరిగితే..
– ఇన్నేళ్లలో కేసీఆర్ చేసిందేంటి?
– మోడీని కలిసినప్పుడు..
– వంగి వంగి దండాలు పెట్టకుండా నిలదీయొచ్చుగా?
రాజకీయాల్లో ఏ మాట వెనుక ఏ ప్రయోజనం దాగి ఉందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం కేంద్రం అంటేనే ఒంటికాలిపై లేస్తున్నారు సీఎం కేసీఆర్. మోడీ టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. బీజేపీతో దేశానికి ప్రమాదం.. కేంద్రంలో ఆపార్టీని గద్దె దించాలని కొద్దిరోజులుగా ఏవేవో చెబుతున్నారు. అవసరమైతే జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకైనా సిద్ధమని ప్రకటించారు. అయితే.. కేసీఆర్ లో వచ్చిన ఈ సడెన్ ఛేంజ్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
2014లో ఒకేసారి అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. రానురాను ఒక్కో రాష్ట్రంలో బలం పుంజుకుంటూ బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా చేసింది. మెల్లిమెల్లిగా తెలంగాణలోనూ పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసీఆర్ సర్కార్ ను ఢీ కొట్టేందుకు బండి సంజయ్ ను రంగంలోకి దింపింది. ఆ తర్వాత చాపకింద నీరులా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో విజయాలతో బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ పరిణామాలన్నీ కేసీఆర్ గ్రహించి.. బీజేపీని లైట్ తీసుకుంటే కష్టమని భావించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు రాజకీయ పండితులు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది కేసీఆర్ కల. 2018 ఎన్నికల సమయంలో ఫ్రంట్ అంటూ హడావుడి కూడా చేశారు. అయితే.. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇన్నేళ్ల మోడీ పాలన వేస్ట్ అని తేల్చేశారు. బీజేపీ మస్ట్ గో నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎన్డీఏ పాలనతో భారీ అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ అనినీతి బాగోతాల చిట్టా తన దగ్గరకు వచ్చిందని అంటున్నారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని చెబుతున్నారు.
2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు జై కొడుతూ వస్తున్న కేసీఆర్.. ఇప్పుడీ సడెన్ యూటర్న్ చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లలో పార్లమెంట్ సాక్షిగా ఎన్డీఏకు సపోర్ట్ గా ఉంటూ వచ్చి ఇప్పుడు అవినీతి ప్రభుత్వం అంటుంటే హాస్యాస్పదంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇన్నాళ్లలో బీజేపీ సర్కార్ లో అవినీతి జరిగితే బిల్లులకు ఎందుకు మద్దతిచ్చినట్లు అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం దృష్టి పెట్టినట్లు కొన్నాళ్లుగా బీజేపీ విమర్శలు చేస్తోంది. దీంతో కేంద్రంపై పోరాటం సాగిస్తే.. ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకున్నా కావాలనే కక్ష గట్టి కేసులు పెట్టారనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ దూకుడు ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.