తల్లిపాలు బిడ్డకు ఎంత శ్రేయస్కరమో అందరికీ తెలిసిందే. బిడ్డకు తల్లి 3 ఏళ్ల పాటు పాలివ్వడం వల్ల బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో కొందరు తల్లులు పలు కారణాల వల్ల తమ బిడ్డలకు పాలివ్వడం లేదు. ఇక అనాథలుగా ఉండే పిల్లలకు తల్లి పాలు అస్సలు లభించవు. అయితే కొన్ని దేశాల్లో తల్లిపాలతో వ్యాపారం చేస్తున్నారు. తల్లి పాలను సేకరించి బాటిల్స్ లో నింపి అమ్ముతున్నారు.
కొన్ని దేశాల్లో తల్లి పాలకు 30 ఎంఎల్‌కు రూ.145 నుంచి రూ.182 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణంగా సగటున ఒక శిశువుకు నిత్యం 700 ఎంఎల్ వరకు పాలు అవసరం అవుతాయి. కొందరు శిశువులు అంతకన్నా ఎక్కువగానే పాలు తాగుతారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని కంపెనీలు అనాథ శిశువులకు తల్లిపాలను అందిస్తాం అని చెప్పి తల్లుల నుంచి పాలను సేకరించి వాటిని బాటిల్స్‌లో నింపి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటారు. ఇది పూర్తిగా అమానవీయ చర్య అని గతంలోనే అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసింది.
అయితే తల్లి పాలను వ్యాపార దృక్పథంతో కాక పేద శిశువులకు, అనాథలకు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ తరహా సేవా కార్యక్రమాల్లో ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని కంపెనీలు అత్యాశతో లాభాపేక్షతో శిశువులకు పాలను అందిస్తామని చెప్పి తల్లుల నుంచి పాలను సేకరించి తరువాత వాటిని అమ్ముకుంటున్నాయి. అయితే అమెరికాలో తల్లి పాల విక్రయంపై ఇప్పటికీ ఎలాంటి ఆంక్షలు లేవు. ఇక మన దేశంలో ఈ తరహా వ్యాపారం లేదు కానీ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు తల్లిపాలను సేకరించి శిశువులకు అందిస్తున్నాయి.