ప్రభుత్వ కార్యక్రమంలో ఆంగ్లంలో మాట్లాడిన ఓ రైతును బిహార్ ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ మందలించారు. ప్రసంగ సమయంలో ఆ రైతు ఎక్కువగా ఆంగ్ల పదాలు వాడటంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే…. బాపు సబాగార్ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్’ప్రారంభ కార్యక్రమాన్ని సీఎం నితీశ్ కుమార్ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా కొంత మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వ్యవసాయంలో వారి అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని ప్రభుత్వం కోరింది.
ఆ మేరకు రైతు అమిత్‌కుమార్ స్టేజి పైకి వచ్చారు. సీఎం నీతీశ్‌ను ప్రశంసిస్తూ తన ఉపన్యాసాన్ని ఆంగ్లంలో ప్రారంభించారు. వ్యవసాయం, పర్యావరణం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. కొద్ది సేపటి తర్వాత ఆయన ప్రసంగాన్ని సీఎం నితీశ్ కుమార్ అడ్డుకున్నారు.
మీరు అతిగా ఆంగ్ల పదాలు మాట్లాడుతున్నారని ఆ రైతును ఉద్దేశించి సీఎం అన్నారు. ఇదేమన్నా ఇంగ్లాండా? మీరు బిహార్‌లో ఎందుకు పని చేస్తున్నారు అటూ ఆయన్ని సీఎం ప్రశ్నించారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని మీరు అభ్యసిస్తున్నారని చెప్పారు.
గవర్నమెంట్ స్కీమ్స్ అని పలికే బదులు సర్కారీ యోజన అనలేరా అని అన్నారు. తానూ ఆంగ్ల మాధ్యమంలో ఇంజినీరింగ్ చదివానని సీఎం పేర్కొన్నారు. అది వేరే విషయమని, రోజు వారీ కార్యకలాపాలకు ఆ భాషను ఎందుకు ఉపయోగించాలని ప్రశ్నించారు.