నెంబర్ 1 స్టేట్ అంటే ఇదేనా అని కేటీఆర్ కు ట్వీట్ ద్వారా చురకలంటించారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని వస్తున్న వార్తలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గారు ఇదేనా నెంబర్ 1 స్టేట్ అంటే..అని ప్రశ్నించారు.
మీరు మీ ఎమ్మెల్యేలకు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించమని చెబుతున్నారా.. అని నిలదీశారు. ఇదేనా మీరు కేసీఆర్, బీఆర్ఎస్ నుంచి నేర్చుకునేది అంటూ బుధవారం ఖమ్మం సభకు ముఖ్య అతిథిలుగా సభలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్,పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆర్ఎస్పీ చేసిన రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
మరో ట్వీట్ లో ఫాసిస్టు మూకలకు అధికారం ఇవ్వద్దు.. అంటూ కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిల నియామకాల్లో పారదర్శకత ఏర్పడిందంటూ న్యాయవ్యవస్థతో ఘర్షణ పడుతున్న కేంద్ర ప్రభుత్వం..తాజాగా పత్రికా వ్యవస్థపైనా దృష్టి సారించింది.. ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లోని నిజనిర్ధారణ విభాగం ఫేక్ గా నిర్ధారించిన ఏ వార్తా కథనాన్ని అయినా ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు తొలగించాల్సిందేనంటూ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కి కేంద్ర ఎలక్ట్ర్రానిక్స్, ఐటీ శాఖ ఒక సవరణను ప్రతిపాదించింది. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఫాసిస్టు మూకలకు అధికారం ఇవ్వద్దన్నారు. ఇస్తే ఇలాగే చేస్తారని మండిపడ్డారు. అందుకే వాళ్ల గురించి వార్తలు రాసేటప్పుడు అన్ని ఆలోచించి రాయాలని.. అడ్వర్టయిజ్మెంట్ రెవెన్యూల కోసమో, ఇంకో దాని కోసమో ఫాసిస్టులను ఆకాశానికికెత్తేస్తే మన ఉరితాడు మనమే బిగించుకున్నట్లు అని ట్వీట్ చేశారు.