ఎంపీ వరుణ్ గాంధీ బీజేపీని వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఆయన సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఆయన ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వస్తున్నారు.
గత నెలలో ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. భారత మాజీ ప్రధాని నెహ్రూకు, కాంగ్రెస్ కు తాను వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. మన రాజకీయాలు అందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా ఉండలన్నారు. అంతేకాని అంతర్యుద్దానికి ప్రేరేపించేలా కాదని బీజేపీకి చురకలంటించారు.
కులం, మతాల పేరుతో ఓట్ల వేటకు వస్తున్న ప్రస్తుత నేతలను యువత నిరుద్యోగం, ఉపాధి, విద్య లాంటి అంశాలపై నిలదీయాలని ఆయన సూచించారు. ప్రజలను అణిచివేసే ధోరణులతో ఉన్న రాజకీయ పార్టీలను మనం విశ్వసించరాదని ఆయన చెప్పారు.
2019లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి మోడీ కేబినెట్‌లో చోటు దొరకలేదు. అప్పటి నుంచి బీజేపీ సర్కార్ పై వరుణ్ గాంధీ గుర్రుగా ఉన్నారు. యోగి ఆదిత్యానాధ్ పేరు తెరపైకి రాకముందు యూపీ సీఎం అభ్యర్థిగా ఆయన పేరు వినిపించింది. కానీ తర్వాత బీజేపీ తనను విస్మరించడంపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి బీజేపీపై ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు.