ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి పాలిటిక్స్ లోకి ఎంటరై సినిమాలకు దూరమైంది. సినిమాలో ఆదరణ లభించినట్లుగా రాజకీయాల్లో కూడా ఆదరణ లభిస్తుందని ఊహించడం అమాయకత్వమే అవుతుంది. సినీ రంగాన్ని వీడి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాములమ్మకు ఏది కలిసి రాలేదు. సుదీర్ఘ విరామం అనంతరం ఈ లేడీ అమితాబ్ సరిలేరు నీకెవ్వరుతో మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిన్న ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చివరగా ఆయన మాట్లాడుతూ విజయశాంతిలో అదే అందం, సొగసు కనబడుతున్నాయని వ్యాఖ్యానించారు. అనంతరం మాట్లాడిన రాములమ్మ వ్యాఖ్యలను బట్టి తన భవిష్యత్ పై అభిమానులకు ఓ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాలు పెద్దగా కలిసిరాకపోవడంతో మెల్లగా పాలిటిక్స్ కు దూరం అవ్వాలని…ఏదేని సినిమాలో కీ రోల్ పోషించే అవకాశం వస్తే తప్పకుండా నటించాలని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. అలాగే చిరంజీవితో మళ్ళీ నటించాల్సి వస్తే ఒకే చెప్పేందుకు ఈ లేడీ అమితాబ్ సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. కానీ ఆమెకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆమె వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విజయశాంతి బీజేపీ వైపు చూస్తున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. బీజేపీ నుంచి సరైన రీతిలో స్పందన లేకపోవడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకొని… కొన్నాళ్లు సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.