ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఇస్కాన్ ఆలయం గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. వరుసగా ఖలిస్తాన్ వేర్పాటు వాద మద్దతుదారులు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల విక్టోరియాలో శ్రీ శివవిష్ణు ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులు చేశారు. నినాదాలతో ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే మెల్బోర్న్‌లో ఇస్కాన్ ఆలయం గోడపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. దీంతో హిందూ సమాజంలో ఆందోళన మొదలైంది.
అంతకుముందు మెల్బోర్న్‌లోని స్వామి నారాయణ్ ఆలయంపై కూడా ఇలాంటి రాతలే కనిపించాయి. ఆలయం గోడలపై భారత వ్యతిరేఖ రాతలు రాశారు. దీంతో పాటు ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు కూడా రాశారు. ఈ క్రమంలో ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో ఖతిస్తానీ మద్దతుదారులు కార్యకలపాలు నిర్వహిస్తూ భారత వ్యతిరేక బీజాలను నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా వారు పాల్పడుతున్నారు.