పార్లమెంట్ లో అఖిల పక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంట్ సీనియర్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్రం తరఫున కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత పీయూష్ గోయెల్ లు హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు.
కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, అదిర్ రంజన్ చౌదరిలు పాల్గొన్నారు. డీఎంకే నుంచి టీఆర్ బాలు, తిరుచ్చి శివ, టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నామా నాగేశ్వర్, ఇతర పార్టీల నుంచి మరి కొందరు ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావడంపై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి.
అఖిలపక్ష సమావేశానికి ఎప్పటి లాగే ప్రధాని మోడీ గైర్హాజరయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఇది అన్ పార్లమెంటరీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. అఖిల పక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, 13 అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని కాంగ్రెస్ మరో నేత మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఈ సమావేశానికి మొత్తం 45 రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కానీ 36 పార్టీలు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యాయని పేర్కొన్నారు. పార్లమెంట్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని ఆయన వెల్లడించారు.