టర్కీ,సిరియాలు ప్రకృతి ప్రకోపానికి ఉనికినే కోల్పోయాయి. భారీ భూకంపం సంభవించి నాలుగు రోజులు దాటినా.. ఇంకా అక్కడ ఏ మూలకు వెళ్లినా హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. పేక మేడల్లా కూలిన భవనాల కింద ఇంకా ఎన్నో వేల మంది చిక్కుకునే ఉన్నారు. కాంక్రీట్ బల్డింగ్ ల శిథిలాల కింద..ఇరుక్కున వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇక శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో బయటపడుతున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈక్రమంలోనే ఓ భనవం శిథిలాల కింద కూర్చున్న స్థితిలో ఉన్న ఓవ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. వెంటనే సహాయక సిబ్బంది శిథిలాలను ఇంకొంచెం తొలగించి చూడగా.. అతడి ఒడిలో ఓ పిల్లాడు కనిపించాడు. ఆ చిన్నారి కూడా చనిపోయి ఉంటాడని అందరూ భావించారు.
అంతా చీకటిగా ఉండడంతో అప్పటి వరకూ కళ్లు మూసుకొని ఉన్న ఆ బాబు.. వెలుతురు రావడంతో కళ్లు తెరిచాడు. ఇది చూసిన సహాయ సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పిల్లాణ్ని హాస్పిటల్ కు తరలించారు. తన కొడుకు మీద శిథిలాలు పడకుండా.. తన శరీరాన్నే రక్షణ కవచంలా మలచిన ఆ తండ్రి మాత్రం ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అందరికి కంట తడి పెట్టిస్తోంది.
కాగా భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం వెళ్లిన భారత బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడమే కాకుండా అత్యవసర వైద్యంతో పాటు సేవలు అందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.