జిహ్వకో రుచి…పుర్రెకో బుద్ధి అన్నారు. అమెరికాలో నివసిస్తున్న ధనవంతుడైన ఓ చైనా వ్యాపారవేత్తకు సరిగ్గా అలంటి కోరికే పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న ఈ సమయంలోనూ తన డాబు, దర్పాన్ని ప్రదర్శించాలనుకొన్నాడు. అందుకోసం పెద్ద ప్లానే వేశాడు.
కరోనా నివారణ దృష్ట్యా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని డాక్టర్లు చెప్తున్నారు. ఈ క్రమంలో మాస్క్ అనేది కంపెనీలకు ఓ పెద్ద బిజినెస్‌గా తయారైంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల మాస్కులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అలాగే కస్టమర్లు ఆర్డర్ చేసిన విధంగా రూపొందించి ఇస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఆ చైనా వ్యాపారవేత్తకు ప్రపంచంలోనే తానే అతి ఖరీదైన మాస్కును ధరించాలనే కోరిక పుట్టింది. ఆలోచన పుట్టిందే తడవు ఆచరణలోకి దిగేశాడు.
టాప్ రేటెడ్ N 99 ఫిల్టర్లు, బంగారం, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తనకు తయారు చేసి ఇవ్వాలని ఓ కంపెనీని కోరాడు. 11 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రత్యేకంగా ఆ మాస్క్‌ను తయారు చేయించుకుంటున్నాడు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో దీన్ని ఆ కంపెనీ తయారు చేస్తోంది. మాస్కు చుట్టూ 3,600 బ్లాక్, వైట్ వజ్రాలతో అలంకరించనుంది. ఈ మాస్క్ తయారు అయ్యేందుకు నాలుగు నెలలు పట్టవచ్చని చెబుతోంది.