ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ తొలిసారిగా భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు తాను ఏప్రిల్ 2న భారత్ కు రానున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇజ్రాయెల్, భారత్ మధ్య సంబంధాలు ఏర్పాటై 30 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ప్రభుత్వాధికారులను, యూధు సంఘం ప్రజలను ఆయన కలుసుకోనున్నారు.
‘ భారత ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు పీఎం నఫ్తాలి బెన్నెట్ తన మొదటి అధికారిక పర్యటన కోసం ఏప్రిల్ 2న భారతదేశానికి చేరుకుంటారు” అని ఇజ్రాయెల్ ప్రధాని విదేశీ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆవిష్కరణ, సాంకేతికత, భద్రత, సైబర్, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్టు అధికారులు తెలిపారు.