సిరియాపై మరోసారి ఇజ్రాయిల్ క్షిపణి దాడి చేసింది. లటాకియా పోర్టులో ఇజ్రాయిల్ యుద్ధవిమానాలు మొత్తం ఐదు పేలుళ్లు జరిపినట్టు సిరియా మిలటరీ అధికారి తెలిపారు. అయితే, ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన మీడియాకు వివరించారు.
ఇజ్రాయిల్, సిరియా మధ్య గత కొంత కాలంగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మరోసారి ఇజ్రాయిల్ దాడి చేసినట్టు తెలుస్తుంది. దాడి జరిగిన లటాకియా పోర్టు సిరియాకు వాణిజ్యపరంగా చాలా ప్రతిష్టాత్మకం. అక్కడికి వచ్చిన దిగుమతులు దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి. అలాంటి నౌకాశ్రయంలో ప్రేలుడు జరిగిందని.. కంటైనర్లు ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని స్థానిక మీడియాలో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి.
ఇప్పటివరకూ ఇజ్రాయిల్.. సిరియాలో వందల సార్లు క్షిపణి దాడులు చేసింది. గతంలో సిరియా రాజధాని డెమాస్కస్ లో కూడా అనేక సార్లు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అయితే, ఇజ్రాయిల్ మాత్రం తాము ఇరాన్ ఫైరట్స్ పైన మాత్రమే దాడులు చేశామని.. ఇతర దాడులతో తమకు సంబంధం లేదని చెబుతూ వస్తుంది.