భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఫలితం పూర్తిగా అందనే లేదు. దాదాపు 50 రోజులు ఎంతో కష్టపడి ఖర్చుపెట్టి చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో ప్రతి దశనూ విజయవంతంగా అధిగమిస్తూ వచ్చిన చంద్రయాన్-2 చివరి ఘట్టం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడింది. 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. చంద్రుడికి చాలా దగ్గరగా వచ్చేసి సమీప కక్ష్యలోకి విజయవంతంగా చేరిన ల్యాండర్ విక్రమ్.. చిట్టచివరి 2 కిలోమీటర్ల దూరంలో.. అది కూడా అతి ముఖ్యమైన చివరి 15 నిమిషాల్లో ఆఖరి నిమిషంలో నిలిచిపోయినట్టు సైంటిస్టులు ప్రకటించారు. ప్రస్తుతం వారంతా సంబంధిత డేటాను పరిశీలించే పనిలో వున్నారు. విజయం చేతికి అందే సమయంలో చందమామ రెండు కిలోమీటర్ల దూరంలో అందని జాబిల్లిగా ముఖం చాటేయడంతో 130 కోట్ల మంది భారతీయులు నిరాశలో మునిగిపోయారు.