షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకి ఎల్వీఎం – 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి కౌంట్ డౌన్ సాగింది. నేటి ఉదయం 9 గంటలకు ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
యూకే దేశానికి చెందిన 36 ఉపగ్రహాలని ఎల్వీఎం-3 రాకెట నింగిలోకి చేర్చనుంది. భూమి ఉపరితలం నుంచి 450 కి.మీ దూరంలోని లియో ఆర్బిటల్ వృత్తాకార కక్ష్యలోకి 36 ఉపగ్రహాలని ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా మొదటి దశలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్ 23న జీఎస్ఎల్వీ-మార్క్ 3 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తాజాగా మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించనుంది.
20 నిమిషాల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన అనంతరం రాకెట్లో ఉంచిన 5,805 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపనున్నారు. వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌండ్ స్టేషన్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు.