నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో రాకెట్ ప్రయోగానికి వేదిక కానుంది. ఈనెల 30న అక్కడ పీఎస్ఎల్వీ సీ 53 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఉపగ్రహా వాహక నౌక పీఎస్ ఎల్వీ సీ 53 ద్వారా సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి తీసుకెళ్లనున్నారు.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కింద ఈ వేదిక వద్దకు రాకెట్ ను చేర్చారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఈ నెల 29 న సాయంత్రం 5 గంటలకు కౌంట్ డౌన్ మొదలు కానుంది.ఈ కౌంట్ డౌన్ దాదాపు 25 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది.
ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్ ఎల్వీ సీ 53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.పీఎస్ఎల్వీసీ 53 వాహక నౌక నింగిలోకి తీసుకుని వెళ్లే మూడు ఉపగ్రహాలలో ఒకటి డీఎస్ -ఈఓదీని బరువు 365 కిలోలు.ఇది ఒక ఎలక్ట్రో ఆప్టిక్,మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ ను కలిగి ఉంటుంది.
మరో ఉపగ్రహం సింగపూర్ కి చెందిన న్యూసార్.దీని బరువు 155 కిలోలు.రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. మూడో ఉపగ్రహం ఎస్ సీ ఓ ఓ బీ-ఐ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ రూపొందించింది.దీని బరువు 2.8 కిలోలు.