అంతరిక్షంలోకి పలు ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన ఇస్రో.. ఇప్పుడు మరో గ్రహంపై దృష్టి సారించింది. ఇప్పటికే చంద్రుడు, అంగారక గ్రహాల మీద ప్రయోగాలు చేపట్టిన ఇస్రో.. సౌరకుటుంబంలోనే అత్యంత ఉష్ణగ్రహంగా పిలిచే శుక్రుడిపైకి శాటిలైట్స్ ను పంపించేందుకు సిద్ధమవుతోంది. 2024 డిసెంబర్ నాటికి ఈ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
ఈ అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో బుధవారం సుదీర్ఘ చర్చలు జరిపిందని.. చర్చల తర్వాత ‘ఇస్రో వీనస్ మిషన్ 2024’ను ప్రకటించినట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రిపోర్టు సిద్ధమైందని.. నిధులు కూడా సమకూరాయని వివరించారు. అత్యంత తక్కువ సమయంలో శుక్ర గ్రహం చెంతకు మిషన్ చేపట్టడం భారత్‌కు సాధ్యమేనని.. ఆ సామర్థ్యం తమకు ఉందని ఆయన పేర్కొన్నారు.
భూమిపై ఉన్నట్టుగానే శుక్రుడుపై జంతుజాలానికి అనువైన వాతావరణం ఉండేదని శాస్త్రవేత్తలు చెప్తుంటారని.. రాను రాను వాతావరణంలో నెలకొన్న పరిస్థితులలో వీనస్.. అత్యంత ఉష్ణోగ్రత కలిగిన గ్రహంగా మారిందంటున్నారని ఆయన స్పష్టం చేశారు. వీసస్ పై వాతావరణం ప్రమాదకరంగా ఉంటుందని, సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఉంటాయని శాస్త్రవెత్తలు చెప్పారంటున్నారు ఛైర్మన్.
వీనస్‌పై నెలకొన్న రహస్యాలను ఛేదించేందుకు అమెరికా సహా పలు దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇస్రో కూడా ఈ దిశగానే మిషన్ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. శుక్రుడి ఉపరితలంపై ఉన్న వాతావరణం దృష్ట్యా వీనస్ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. మరోవైపు.. నాసా కూడా శుక్రుడి చెంతకు రెండు వ్యోమనౌకలకు పంపనున్నట్టు తెలుస్తోంది.