ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ ‘సర్వే’ లను కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. జీ-20 కూటమికి ఇండియా అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణంలో ఈ ‘దాడులు” విదేశాల్లో భారత ప్రతిష్టను మంటగలుపుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రధాని మోడీకి సంబంధించిన గతాన్ని ఎవరు ప్రశ్నించినా.. వారిపై ఇలా దాడులు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య నాలుగో స్థంభానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని ఆయన విమర్శించారు.
ఇండియా ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదైతే.. మోడీ… ‘హిపోక్రసీ’ కి తండ్రి వంటివారని ఆయన ఎత్తిపొడిచారు. ఈ దాడులతో ఆయన ఏం సాధించదలచుకున్నారని, ప్రపంచానికి ఏం చూపాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మోడీ తానే ‘ఫాదర్ ఆఫ్ హిపోక్రసీ’ గా మారిపోయారన్నారు.
ఇండియాలో మీడియా గొంతును మాటిమాటికీ నులుముతున్నారని, మోడీ ప్రభుత్వం మీడియాను బుల్డోజర్లతో ‘పాతరేస్తోందని’ పవన్ ఖేరా ఆవేశంగా వ్యాఖ్యానించారు. బీజేపీకి అనుకూలంగా లేని కొద్దిమందిపై ఈ ప్రభుత్వం కక్ష గడుతోందన్నారు. ‘స్టార్టప్ ఇండియాను’ ముందుకు తీసుకువెళ్తానని ఆయన ప్రామిస్ చేశారు.. కానీ ఈ ‘అమృత్ కాల్’ లో ఈ దేశం ‘షటప్ ఇండియా’ గా మారిపోయింది’ అని ఖేరా అన్నారు.
ఈ ఏడాది జీ-20 కి అధ్యక్షత వహిస్తున్న దేశంగా ఇండియా ఎన్నో ఈవెంట్లను నిర్వహించనుందని.. అలాంటిది ఈ సమయంలో ప్రధాని ఈ ఐటీ దాడుల ద్వారా ప్రపంచ దేశాలకు ఏం చెప్పదలచుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ ‘సర్వే’ లను అమెరికాసహా పలు విదేశీ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి.