హైదరాబాద్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని జీడిమెట్లలో ఉన్న వసుధా ఫార్మా కెమికల్స్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వసుధా ఫార్మ కెమికల్స్ పేరుతో ఫార్మా వ్యాపారంతో పాటు ఇదే పేరుతో డైరెక్టర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నారు.
కంపెనీ డైరెక్టర్ రాజు వసుధా ఫార్మా పేరుతో రియల్ బిజినెస్ చేస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 15 కంపెనీల పేరుతో రియల్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లు, ముఖ్య అధికారుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వసుధా ఫార్మా కెమికల్స్ కంపెనీ నగరంలోని జీడిమెట్లలో ఉన్నది. 1994లో ఈ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ వివిధ రకాల మెడిసిన్స్‌ను తయారు చేస్తున్నది. దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నది.
1997-98లో 0.25 మిలియన్ డాలర్లతో ప్రారంభమైన ఈ వ్యాపారం 2020-21 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి 145 మిలియన్ డాలర్లకు చేరుకుంది. 113 మంది శాస్త్రవేత్తలు ఈ కంపెనీలో పనిచేస్తున్నట్లు వసుధా ఫార్మ కెమికల్స్ కంపెనీ ఫ్రొఫైల్‌ను బట్టి తెలుస్తోంది.
వసుధ ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో అధికారులు తనిఖీలు చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీమ్ లు సోదాలు జరుపుతున్నాయి.
ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు వెంకట రామరాజు. గతంలో పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు అధికారులకు లభించాయి. వాటి ఆధారంగా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ లో ఎంవీ రామరాజు ఛైర్మన్ గా వున్నారు.
ఎంఎఎస్ రాజు, ఎం ఆనంద్, ఎంవీఎన్ మధుసూదన్ రాజు, ఎంవీఎస్ఎన్వీ ప్రసాద్ రాజు, ఎం.వరలక్ష్మి, కె.వెంకటరాజు, జి.వెంకటరమణ రాజు, డా.పీవీ అప్పాజీ, కొత్తపల్లి శ్రీహరి వర్మ సభ్యులుగా వున్నారు. వసుధ ఫార్మా రాజు 1995 లో సాధారణ స్థాయి నుంచి ఎదిగారు.
అద్దె ఇంటి నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన రాజు అంచెలంచెలుగా ఎదిగారు. వసుధ ఫార్మా టర్నోవర్ 500 నుంచి 1000 కోట్లకు చేరుకుంది. కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు.