గతకొంత కాలంగా యూపీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వరుస దాడులు పలువురిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి రామ్ నారాయణ్ సింగ్ ఇంట్లో ఐటీ అధికారులు ఆకశ్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
రామ్ నారాయణ్ సింగ్ ఇంటి బేస్మెంట్లో కోట్ల రూపాయల నగదును గుర్తించారు. నోయిడా సెక్టార్ 50లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు తెలిపిన కొన్ని విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంటి బేస్ మెంట్ లోనే ఓ ఆఫీస్ ఓపెన్ చేసి.. ఒక సంస్థను నడిపిస్తున్నట్టు చెప్పారు.
అందులో ఆ కంపెనీకి 650 లాకర్లు ఉన్నాయని సంచలన విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. ఇంకా సోదాలే జరుగుతున్నాయని.. తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పారు.
బినామీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కానీ.. అధికారికంగా ఎంత సొమ్ము అనేది ప్రకటించలేదు. యూపీలో ఎన్నికల ముందు జరుగుతున్న ఐటీ దాడులు అన్ని పార్టీల నాయకుల్లో ఆందోళన కలిస్తోంది. ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియక కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Advertisements