దేశంలో ప్రాజెక్టుల నిర్మాణరంగంలో దూసుకపోతున్న కంపెనీ హవాలా మార్గంలో భారీ ఎత్తున డబ్బు రవాణా చేస్తుందా…? హైదరాబాద్ సహ దేశంలోని ప్రముఖ నగరాల్లోని తమకు అండగా నిలిచిన వారి కోసమే భారీ ఎత్తున డబ్బును తరలించాలనుకున్నారా…? కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ మాటు వేసి పట్టుకున్న భారీ హవాలా కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దేశంలోని ప్రముఖ నిర్మాణ కంపెనీగా చలామణిలో ఉన్న కంపెనీ హవాలా రూపంలో 3300కోట్ల భారీ నగదును వివిధ పట్టణాలకు సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ప్రముఖ కార్పోరేట్ దిగ్గజ కంపెనీలకు సంబంధమున్న ఆ కంపెనీ హైదరాబాద్ సహ ముంబాయి, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాలకు హవాలా రూపంలో ఈ సొమ్మును రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ప్రత్యక్ష పన్నుల శాఖ, మాటు వేసి పట్టుకుంది.
ఈనెల మొదటివారంలో ఢిల్లీ, ముంబాయి సహ 42 చోట్ల ఈ ప్రాజెక్టుల నిర్మాణ సంస్థ కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దొరికిన సమాచారం ఆధారంగా ఐటీ ఇచ్చిన సమాచారంతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ అధికారులు ఈ హవాలా రాకెట్ గుట్టురట్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
నిర్మాణరంగంలో ప్రముఖ సంస్థగా ఎదుగుతోన్న ఈ కంపెనీ… పెద్ద ఎత్తున పన్నులను ఎగ్గొట్టిందన సమాచారంతో ఐటీ సోదాలు నిర్వహించింది.