ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జీతాల్లేక, చేసిన పనికి జీతం రాక… అసలు జీతం ఎప్పుడొస్తుందో అర్థంకాక ఇబ్బందిపడుతోన్న ఆర్టీసీ కార్మికుల కోసం ఐటీ ఉద్యోగులు సహయం చేసేందుకు నడుంబిగించారు. ప్రభుత్వం జీతం ఇవ్వకుంటే మనం అండగా ఉందాం అంటూ ఫండ్ రెయిజింగ్ మొదలుపెట్టారు.
ఆకలితో ఉన్న వాడికి ఓ ముద్ద అన్నం పెడితే ఎంత సంతృప్తి వస్తుందో… మాటల్లో వర్ణించలేనిది. ఆ ఆకలికి కులం, మతం, తమ, పర అనే భేదాలుండవు. ఇప్పుడదే ఆకలితో ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. 43రోజుల సమ్మెతో ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద పోరాడుతున్నారు. రెండున్నర నెలలుగా రూపాయి సంపాదన లేదు. ఇంటికి అద్దె చెల్లించలేక, నిత్యవసరాలకు డబ్బులేక, నెల నెలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు… ఇలా అన్నీ ఇన్నీ ఇబ్బందులు కావు. ప్రభుత్వానికి ఎలాగు మానవత్వం లేదు… కనీసం మనమైనా అండగా నిలబడదాం అని మందుకు వచ్చారు ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న కొంతమంది యువత.
తాము సహయం చేస్తే… ఒకరిద్దరికి కూడా సరిపోదు. కానీ ఓ సముహాంలా మారి, దాతల నుండి విరాళాలు సేకరిస్తే… పదుల సంఖ్యలో అయిన కార్మికులకు చేయూతనివ్వొచ్చు అన్న వారి సంకల్పం ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువతను ఒక్కటి చేసింది. ఇక ఆలస్యం చేయటమేందుకు అని అల్విన్ చౌరస్తాలో… ”ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం జీతం ఇవ్వటం లేదు-మనం అండగా ఉందాం” అన్న ప్లకార్డులతో ఫండ్ రెయిజింగ్ మొదలుపెట్టారు. 10 రూపాయల నుండి 500వరకు చిన్నారులు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు ఇలా ఒకరేంటి… ఎవరికి తోచినంత వారు ఇచ్చారు. అలా 7000రూపాయలను సేకరించారు.
మియాపూర్ డిపో కార్మిక సంఘాల నేతల నుండి దయనీయ పరిస్థితుల్లో ఉన్న కార్మికుల లిస్ట్‌ను సేకరించి… వారికి అందిస్తున్నట్లు తెలుస్తోంది.