– ఆదిత్య కంపెనీలో కొనసాగుతున్న ఐటీ దాడులు
– మైత్రీ మూవీస్ లావాదేవీలపై రాని స్పష్టత
– కోటారెడ్డి కోటాను కాపాడుతున్న అకౌంటెట్స్
– సమాచారం కోసం కొడుతున్నారంటున్న ఉద్యోగులు
– ఆరోపణలపై చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
– ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పై ఐటీ ఫోకస్
క్రైంబ్యూరో, తొలివెలుగు:తెలంగాణలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ఏ సంస్థలో చేసినా నాలుగు రోజులు పడుతోంది. డైరెక్టర్స్, ఉద్యోగులు సహకరించకపోవడంతో అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫినిక్స్, వంశీరాం, కోటారెడ్డి శ్రీ ఆదిత్య హోమ్స్ లో ఇదే జరుగుతోంది. మూడు రోజుల పాటు 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. మైత్రీ మూవీస్ కి పెద్ద ఎత్తున ఫైనాన్స్ చేశారనే ఆరోపణలతో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
గత 5 సంవత్సరాలుగా ఆడిటింగ్ లో పెద్దఎత్తున లెక్కలు చూపించలేదని ఆధారాలు సేకరించింది ఐటీ. దీంతో వివిధ కంపెనీలతో జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు అధికారులు. బెంగళూరు, హైదరాబాద్ లోని నిర్మాణ సంస్థల్లో అధిక మొత్తంలో నగదు సేకరించినట్లు రిసిప్ట్స్ లభించాయి. వంశీరాం బిల్డర్స్ తో పాటు మరికొంత మంది బంధువుల అకౌంట్స్ ని చెక్ చేసినట్లు తెలుస్తోంది. సుబ్బిరామిరెడ్డి కుటుంబంతో పాటు ఇందూరి శ్యాంప్రసాద్ రెడ్డి , జీవీకే కుటుంబానికి కోటారెడ్డికి బంధుత్వం ఉంది. వివిధ కంపెనీల్లో కామన్ డైరెక్టర్స్ లెక్కలపై ఆరా తీశారు అధికారులు. ఈక్రమంలో మొత్తం 15 కంపెనీల డేటా కలెక్ట్ చేసినట్లు సమాచారం.
ఆదిత్యపై ఆరా!
బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా భారీగా లబ్ది పొంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అయ్యారని తోట చంద్రశేఖర్ పై ఆరోపణలు ఉన్నాయి. హఫీజ్ పేట్ ల్యాండ్ స్కాంలో 40 ఎకరాల్లో ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మాణాలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న లిటిగేషన్స్ ని క్లియర్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. సీఎస్ 14 భూముల్లో ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించింది. సీఎస్ 7 భూములైన మియాపూర్ లో కూడా అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు వినికిడి. దీంతో ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పై ఐటీ ఫైల్ చేసిన రిటర్న్స్ ని ఆడిటింగ్ రిపోర్ట్స్ ని తీసుకుని పరిశీలిస్తోంది. ఆదిత్య పేరుపై సెంట్రల్ ఫోకస్ చేయడంతో మొదట కోటారెడ్డి కోటా ఈజీగా చిక్కింది. ఆ తర్వాత తోట వారి ఆదిత్యపై మెరుపు దాడులు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.