ఉత్తరాఖండ్ లో ఈ నెల 4 న కొండచరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకులు మరణించగా సుమారు 41 మంది ట్రైనీలు, ఏడుగురు ఇన్ స్ట్రక్టర్లు ప్రమాదానికి గురయ్యారు. . 28 మంది గల్లంతయ్యారు. వీరు ఉత్తరకాశీ లోని ద్రౌపది కా దండా శిఖరాన్ని ఎక్కుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. వాతావరణం మొదట బాగున్నప్పటికీ ఆ తరువాత హఠాత్తుగా మారిపోయి కొండచరియలు విరిగిపడడం ప్రారంభించాయి. పర్వతారోహకుల్లో ఎవరు ఏ పాయింట్ వద్ద ఉన్నారో తెలియకుండా పోయింది. గల్లంతయినవారిని, గాయపడినవారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమించాయి.
మూడు హెలీకాఫ్టర్లను రంగంలోకి దించారు. క్షతగాత్రుల్లో 14 మందిని ఇండో-టిబెటన్ ఫోర్స్ బృందాలు మాల్టీ హెలిపాడ్ వద్దకు చేర్చగలిగాయి. నెహ్రూ మౌంటెయినీరింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన సాహసోపేత బృందం ఈ శిఖరానికి బయల్దేరింది. అయితే మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో శిఖరంపై 17 వేల అడుగుల ఎత్తున వీరు ఉండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి.. చరియలు విరిగిపడుతూ వచ్చాయి.
దట్టమైన మంచులో కొందరు చిక్కుకుపోయారు. నిజానికి సెప్టెంబరు 14 న వీరి సాహసోపేత ప్రయాణం మొదలైంది. ఈ నెల 8 న ముగించాలన్నది వీరి ధ్యేయం. కానీ 4 న అనుకోకుండా ఈ ప్రమాదానికి గురయ్యారు.
ఈ ఘటనలో గాయపడినవారిలో ఇద్దరు ట్రెయినీలు తమకు కలిగిన అనుభవాలను తలచుకుని ఇప్పటికీ వణికిపోతున్నారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తాము మృత్యువు అంచువరకు వెళ్లి వచ్చామని వారు చెప్పారు. సహాయక బృందాలే తమను రక్షించకపోయి ఉంటే తమకు మరణం సంభవించేదని అన్నారు. తాము రెండు గంటలపాటు మంచులో చిక్కుకుపోయామని, ఊపిరాడక నానా అవస్థలు పడ్డామని సునీల్ లాల్వానీ అనే ట్రైనీ తెలిపారు. నలుగురు ఇన్ స్ట్రక్టర్లు అతికష్టం మీద తమను మంచు లోంచి బయటికి తీశారన్నారు. ఆ వెంటనే సహాయక బృందాలు మమ్మల్ని మాల్టీ హెలిపాడ్ వద్దకు చేర్చాయని చెప్పారు. బుధవారం నలుగురి మృతదేహాలను పోలీసులు, రక్షణ బృందాలు వెలికి తీయగలిగాయి.