అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా విధ్వంసం చెలరేగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు వీరంగం సృష్టించారు. పట్టాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రైల్వే ఆస్తుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించింది రైల్వే చట్టం. కొందరు టికెట్ తీసుకోకుండా సరకులు రవాణా చేసే బోగీలో ఎక్కుతారు.. ఇలాంటి వారిపై ఆర్పీఎఫ్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటోందని వివరించింది.
గేటు వేసినప్పుడు, ఆగి ఉన్న రైలు కింద నుంచి గానీ, మధ్య నుంచి గానీ దాటితే నేరంగా పరిగణిస్తారని వెల్లడించింది రైల్వే చట్టం. రైల్వే పోలీసులు ఇలాంటి వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపితే రూ.వెయ్యి జరిమానా లేదా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటోందని స్పష్టం చేసింది. పట్టాలే కదా.. అని ఇష్టమొచ్చినట్లు వాటని దాటితే కుదరదని.. రైల్వే సూచించిన చోట లేదా లెవల్ క్రాసింగ్ ల వద్ద నిబంధనలను అనుసరించి మాత్రమే దాటడానికి అనుమతి ఉంటోందని రైల్వే చట్టంలో పేర్కొనబడింది.
అంతేకాకుండా.. పట్టాల మీద ఉండే ఒక్క రాయి తీసుకెళ్లినా రైల్వే ఆస్తుల దొంగతనం కింద కేసు నమోదు చేసే హక్కు రైల్వే పోలీసులకు ఉంటుందని నిబందనల్లో పేర్కొనబడింది. కొందరు ఇనుప ముక్కలు, రాగి తీగలు ఎత్తుకెళ్తుంటారు.. స్టేషన్ లో విద్యుత్తు స్విచ్చులు, లైట్లను ధ్వంసం చేయడం వంటివి చేస్తారు. ఇవన్నీ రైల్వే చట్టం ప్రకారం నేరాలుగా పరిగణనలోకి తీసుకుంటారని వివరించింది. యార్డులో బొగ్గు, గూడ్స్ ఆగినప్పుడు అందులో నుంచి బొగ్గు, బియ్యం తీసుకోవడం పెద్ద నేరంగా చెప్తోంది చట్టం. ఇలాంటి వాటిపై కేసులు నమోదవుతాయని చట్టంలో పేర్కొనబడింది.
రైల్వే స్టేషన్ లలో, రైళ్లల్లో పొగ తాగినా.. చెత్త వేసినా నేరంగానే పరిగణిస్తారని వివరించింది రైల్వే చట్టం. స్వచ్ఛభారత్ కింద వారికి రూ. 250 జరిమానా ఉంటుందని వివరించింది. మద్యం తాగి వీరంగం చేసినా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా.. ఎక్కడైనా దింపే అధికారం టీసీలు, రైల్వే పోలీసులకు ఉంటుందని తెలిపింది. ప్లాట్‌ఫారం మీదకు వెళ్లాలంటే రైలు టికెట్ తీసుకోవాలని.. ఒకవేళ టికెట్ లేకుండా వెళ్తే కనిష్ఠంగా రూ.250 జరిమానా లేదా కోర్టులో ప్రవేశపెడితే శిక్ష కూడా వేసే అవకాశం ఉంటుందని చెప్పింది.
Advertisements
వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు కూడా రిజర్వేషన్ బోగీలో ఎక్కితే.. వారికి కనీసం రూ.250 నుంచి ఆపైన జరిమానా విధించే అవకాశం ఉంటోందని తేల్చి చెప్పింది రైల్వే చట్టం. అంతే కాకుండా ఎలాంటి కారణం లేకుండా రైలు చైన్ లాగితే రూ.1000 వరకు జరిమానా వేసే అధికారం టీసికి ఉంటుంది. బోగీలో దొంగలు ప్రవేశించినప్పుడు.. అనుకోని ఘటనలు, ప్రమాదాలు జరిగినప్పుడు.. రోగులు, వృద్ధులు, పిల్లలకు అత్యవసర సేవలకు కూడా స్టేషన్ల వద్ద చైన్ లాగడానికి అవకాశం ఉంటుందని రైల్వే చట్టం వెల్లడించింది.