కేటీఆర్ లీగల్ నోటీస్ పై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ పరువుకే రూ.100 కోట్లయితే..30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావ్? అంటూ నిలదీశారు. లీకేజీలో నా కుట్ర ఉందన్న నీపై ఎంత దావా వేయాలని బండి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నోటీసులపై లీగల్ గానే ఎదుర్కొంటామని కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాటం ఆగదన్నారు బండి సంజయ్.
ఇక పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే.. నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. కేటీఆర్ నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు బండి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటన్నారు.
కేటీఆర్ ఒక స్వయం ప్రకటిత మేధావి అని.. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నారని.. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞాని అని.. కేసీఆర్ పాలనలో భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గుడని మండిపడ్డారు ఆయన.
ఇక ప్రధానమంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుండి నేటి ప్రశ్నాపత్రాలు లీకేజ్ వరకు ఐటి శాఖ మంత్రే బాధ్యత వహించాలన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందన్నారు ఆయన. కేసీఆర్ కొడుకును మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు బండి సంజయ్.