విపక్షాలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విపక్షాలు చెబుతున్నట్టు తమది నిజంగా ఈడీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
అందులో ఈ-ఏక్ నాథ్ షిండే డీ- దేవేంద్ర ఫడ్నవీస్ అని ఆయన వివరణ ఇచ్చారు. ఒక శివ సైనికుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యారని అంటూ షిండే వర్గమే నిజమైన శివసేన వర్గంగా పరోక్షంగా ఆయన అభివర్ణించారు.
గత ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేనలు పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం తమ కూటమికి మెజార్టీ వచ్చిందన్నారు. కానీ కొందరు ఉద్దేశ పూర్వకంగా తమ మెజారిటీని కొందరు లాక్కున్నట్టు ఆయన చెప్పారు.
ఇప్పుడు ఏక్ నాథ్ షిండేతో మరోసారి బీజేపీ శివసేన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నట్టు వివరించారు. పదవి లేకుండా ఇంట్లో కూర్చోవాలని పార్టీ తనను ఆదేశించి ఉంటే తాను అలాగే చేసేవాడినన్నారు.
ఇదే పార్టీ తనను గతంలో సీఎం చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో అధికారం కోసం ఎలాంటి గొడవలు జరగబోవని ఈ రోజు తాను చెబుతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.