అఖిల భారత సర్వీసు అధికారులు, ఫెడరలిజం, ప్రజాస్వామ్యం విషయంలో సీఎం కేసీఆర్ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి మండిపడ్డారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్.. 1954 ప్రతిపాధించిన సవరణలను వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాయడం పట్ల సీఎంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్ నిబంధనలకు సంబంధించి కేంద్రం నిర్ణయాన్ని ఆక్షేపిస్తూనే.. సీఎం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇస్తున్న విలువను చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ అధికారులను చిన్న చూపు చూస్తూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఒక ప్రజాప్రతినిధిలా వ్యవహరిస్తూ.. అధికారుల మధ్య చిచ్చు పెట్టడాన్ని సీఎం మానుకోవాలని సూచించారు. సమర్థులైన అధికారులకు తగిన పోస్టులు ఇవ్వకుండా.. నాన్ ఫోకల్ పోస్టులకు పరిమితం చేశారని అన్నారు. టీఆర్‌ఎస్ నేతలకు తొత్తులుగా ఉన్న వారికి ఫోకల్ పోస్టులు కల్పించారని.. దీంతో చాలా మంది ఏఐఎస్ అధికారులు పోస్టింగ్ లు రాకుండా కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు.
సీఎం బహిరంగ చర్చకు వస్తే.. పదుల సంఖ్యలో సమర్థులైన అధికారులకు ఎలా అన్యాయం జరిగిందో నిరూపిస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్ల సీఎంకు గౌరవం లేదని.. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని విమర్శించారు. సీఎం ఫెడరలిజం గురించి, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడుతున్నప్పటికీ.. మొత్తం పరిపాలనను అంతా తన చేతుల్లో ఉంచుకున్నారని మండిపడ్డారు.
దేశంలో పరిపాలనను మెరుగుపరిచేందుకు కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయని.. తమకు నచ్చిన పోస్టుల్లో ఏఐఎస్ అధికారులను నియమించే హక్కు కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర కేడర్ లోని చిత్తశుద్ధి, సమర్ధులైన అధికారుల సేవలను ముఖ్యమంత్రి ఉపయోగించుకోలేక.. తన కుటిల వ్యూహాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు నారాయణరెడ్డి.