2023-24 సంవత్సరానికి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ను చరిత్రాత్మకమైనదిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇది ‘అమృత కాల్ బడ్జెట్’ అంటూ.. సమాజంలో పేదలు, అణగారిన వర్గాల ఆశయాలను నెరవేరుస్తుందనడంలో సందేహం లేదన్నారు. ఒక విధంగా ఈ బడ్జెట్ అమృత కాలానికి పునాది అన్నారు.
అభివృద్ధి చెందిన ఇండియాకు ఇది గట్టి పునాది మాత్రమే కాదని, మధ్యతరగతి వర్గాలు, రైతుల వంటి అనేక వర్గాలఆశలను కూడా తీరుస్తుందని ఆయన చెప్పారు. ఈ చరిత్రాత్మక బడ్జెట్ ని రూపొందించినందుకు నిర్మలా సీతారామన్ ను, ఆమె టీమ్ ను అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ పథకం కింద విశ్వకర్మలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో ఇది పెను మార్పు తెస్తుందన్నారు. సాంప్రదాయకమైన తమ వృత్తుల ద్వారా విశ్వకర్మలు ఈ దేశ సృష్టికర్తలయ్యారని మోడీ అభివర్ణించారు.
మొట్ట మొదటిసారిగా బడ్జెట్లో వీరికి శిక్షణ, తోడ్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చినట్టు ఆయన చెప్పారు. వారికి టెక్నాలజీ పరంగా సాయం, రుణాలు ఇవ్వడం, మార్కెట్ సపోర్ట్ కల్పించడం వంటి సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. గ్రామీణ మహిళల వికాసానికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఈ బడ్జెట్ ..వారి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉందని మోడీ వివరించారు.