ప్రజాస్వామ్యం లేదా అభివృద్ధి అంశాల్లో నేడు జమ్మూ కశ్మీర్ కొత్త ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటి సారిగా జమ్ము కశ్మీర్ లో ప్రధాని మోడీ ఆదివారం పర్యటించారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సంద్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అభివృద్ధి కావచ్చు లేదా ప్రజాస్వామ్యం కావచ్చు అన్నింటిలోనూ జమ్ము కశ్మీర్ ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోందన్నారు. గత రెండు మూడేండ్లలో జమ్ములో గొప్ప అభివృద్ధి జరుగిందన్నారు. నేడు జమ్ములో పంచాయతీరాజ్ దివస్ జరుపుకోవడం మార్పుకు చిహ్నంగా కనిపిస్తోందన్నారు.
జమ్ముకశ్మీర్ లో ఇప్పుడు కొత్త అభివృద్ది చరిత్రను లిఖిస్తున్నారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు గతంలో 175 చట్టాలు అమలు కాలేదని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇవి అమలులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి సాధికారత కల్పించేందుకే ఈ చట్టాలను తీసుకు వచ్చినట్టు తెలిపారు.
విద్యుత్, నల్లా కనెక్షన్లు అయినా, స్వఛ్చ్ భారత్ అభియాన్ కింద టాయిలెట్ల నిర్మాణమైన జమ్ములో కేంద్ర పథకాలను చాలా వేగంగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకు ముందు జమ్ములో 20000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారు.