జమ్మూ కశ్మీర్ లో భారత్ జోడో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ జాకెట్ ధరించి కనిపించారు. ఇప్పటివరకు టీ షర్ట్ తో కనిపించిన ఆయన.. ఇన్నాళ్ల తరువాత జాకెట్ తో కనిపించగానే అంతా ఆశ్చర్య పోయారు. నిజం చెప్పాలంటే 125 రోజుల తరువాత మొదటిసారిగా ఆయన దీన్ని ధరించడంతో ఇది ‘సెన్సేషనల్’ వార్తే అయింది. అయితే ఇది జాకెట్ కాదని, రెయిన్ కోట్ అని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్పష్టం చేసింది. కథువా లోని హాల్తీ మార్గ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ ఈ కోటు ధరించారని పేర్కొంది.
కానీ దీనిపైనా కొత్త కథనాలు, ఊహాగానాలు రేగడంతో.. ఆయన ‘రెయిన్ కోటు’ ను విప్పేశారు. కొందరు నెటిజనులు దీన్ని కూడా పాయింట్ చేశారు. సాధారణంగా ఉత్తరాదిన శీతాకాలమైనా.. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రాహుల్ టీ షర్ట్ తోనే పాదయాత్ర చేస్తూ వచ్చారు. కానీ శుక్రవారం ఆయన జాకెట్ ధరించి కనబడగానే అది ఓ ‘సంచలనమైంది’.
కశ్మీర్ లో తరచూ చిరు జల్లులు కూడా పడే అవకాశం ఉన్నందున ఆయన రెయిన్ కోటు ధరించారని పార్టీ వివరించింది. చలికాలమైనా.. వెచ్చదనం కోసం తాను జాకెట్ ధరించరాదని రాహుల్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా
హర్షం ప్రకటిస్తున్నారు. ఇది ఆయన నిరాడంబరతకు నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. చలికి తాను వణికితేనే స్వెటర్ ధరించాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన లోగడ ప్రకటించారు.
శుక్రవారం వాతావరణం మబ్బులు పట్టి చిరు జల్లులు పడుతుండడంతో రాహుల్ రెయిన్ కోటు ధరించారని అంటున్నారు. ఈ వాతావరణం కారణంగా యాత్ర సుమారు 15 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.