కేసీఆర్ కు మహిళలంటేనే ద్వేషమని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటని అన్నారు. సంచలనం కోసమే బీఆర్ఎస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని బండి సంజయ్ ఆరోపించారు.
రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదన్న విషయం వారు మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రపతి స్పీచ్ విన్న తర్వాత ఎవరూ కూడా బహిష్కరించాలనుకోరని అన్నారు. పార్లమెంటులో సహృద్బావ వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోడీ ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని బండి గుర్తు చేశారు.
రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ మహిళా ద్వేషి అని అందుకే ఫస్ట్ కేబినేట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని అన్నారు. కేసీఆర్ మహిళా గవర్నర్ ను అవమానిస్తున్నారన్న ఆయన హైకోర్టులో ఆమె పై కేసు ఎందుకు వేశారో తెలియక జనాలు నవ్వుతున్నారని అన్నారు. గవర్నర్ అంటే వారికి గౌరవం లేదన్నారు.
వాస్తవాలు మాట్లాడితే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇలా ఉంటే.. ఎన్డీయే వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ పార్టీ తెలియజేసింది. రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన ఉంటుందన్నారు. కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్ లో ఎండగడతామన్నారు. అఖిలపక్ష సమావేశంలోనూ మా వైఖరి స్పష్టంగా చెప్పాం అని కేకే పేర్కొన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం పై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.