వరుసగా రెండు సార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్యవాదాలు తెలిపారు. ఇది కచ్చితమైన, సరైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వమని వారు విశ్వసించారన్నారు. మంగళవారం పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె.. 2047 నాటికి ఇండియా అద్భుత ప్రగతిశీలక దేశంగా మారుతుందని, పరిపూర్ణమైన ‘ఆత్మనిర్భర్’ దేశంగా ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శ దేశమవుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఈ 25 ఏళ్ళ కాలం అమృత కాలమని ఆమె అభివర్ణించారు.
ఆ సంవత్సరం నాటికి ఇండియాను పూర్వ వైభవం, అత్యాధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో నిర్మించాలని ఆమె పేర్కొన్నారు. ‘సమాజానికి, దేశానికి దిశా నిర్దేశం చేసేందుకు యువత, నారీ శక్తి ముందుండాలి.. కాలానికి రెండు అడుగులు ముందు నిలిచే యువత గల దేశంగా ఇండియా ఎదగాలని’ రాష్ట్రపతి ఆకాంక్షించారు. ‘ప్రజాస్వామ్యానికి, సాంఘిక న్యాయానికి అతి పెద్ద శత్రువైన అవినీతిని నిర్మూలించాలి. ఇందుకు నిరంతర పోరాటం జరుగుతోంది.. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారయ్యే క్రిమినల్స్ ఆస్తులను జప్తు చేసేందుకు ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్ ను ఈ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది’ అని ఆమె తెలిపారు. అవినీతి రహిత దేశంగా మారే దిశగా ఇండియా పయనిస్తోందని ఆమె చెప్పారు.
టాక్స్ పేయర్స్ తాము చెల్లించిన పన్ను రిఫండ్ కోసం లోగడ చాలాకాలం పాటు నిరీక్షించవలసి వచ్చేదని, కానీఇప్పుడు రిటర్నులు దాఖలు చేసిన కొన్ని రోజుల్లోనే రిఫండ్ పొందగలుగుతున్నారని ఆమె అన్నారు. ఒక దేశం, ఒకే రేషన్ కార్డ్, జన్ ధన్-ఆధార్ మొబైల్ నెంబర్ల అనుసంధానం వల్ల బోగస్ లబ్ధిదారులను గుర్తించి తొలగించగలుగుతున్నామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కొంటున్నాయని, ఆ దేశాలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని చెప్పిన రాష్ట్రపతి.. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న స్థిర నిర్ణయాల కారణంగా ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో మెరుగైన దేశంగా ఇండియా ఉందన్నారు. రక్షణ రంగంలో ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని, ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను అత్యాధునిక నౌకగా అభివృద్ధి చేసినందున ఇది తొలి స్వదేశీ విమాన వాహక నౌకగా నావికా దళంలో చేరిందని ఆమె పేర్కొన్నారు.