కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ ఇంటి నుంచి అధికారులు మొదట రూ. 6 కోట్లు, ఆ తరువాత అతని కార్యాలయం నుంచి మరో 1.7 కోట్లు స్వాధీనం చేసుకున్న ఉదంతం సంచలనం రేపింది. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రశాంత్ ఇల్లు, కార్యాలయంలో నోట్ల కట్టలు లెక్కించడానికి అధికారులకు గంటలు పట్టింది. అయితే ఇదంతా ఆషామాషీగా జరగలేదని, తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందిన తరువాతే ‘వల’ వేసి పట్టేశామని లోకాయుక్త జస్టిస్ బీఎస్. పాటిల్ తెలిపారు.
ఈ విషయంలో తమపై రాజకీయంగా ఎలాంటి ఒత్తిడీ రాలేదని చెప్పిన ఆయన.. ఇందులో ఎమ్మెల్యే విరూపాక్షప్ప ప్రమేయం కూడా ఉందా అన్నదానిపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇప్పుడే దీనిపై నిర్ధారణకు రాలేమన్నారు. ప్రశాంత్ ని లోకాయుక్త అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. లోకాయుక్త లోని అవినీతి వ్యతిరేక విభాగం హఠాత్తుగా ప్రశాంత్ ఇంటిపై దాడి చేసి అవినీతి సొమ్ము గుట్టు రట్టు చేసింది.
లోకాయుక్తకు అన్ని అధికారాలిచ్చాం.. సీఎం బసవరాజ్ బొమ్మై
ప్రభుత్వంలో అవినీతిని నిర్మూలించేందుకు తాము లోకాయుక్తకు అన్ని అధికారాలూ ఇచ్చామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని, లోకాయుక్త స్వతంత్రంగా పని చేస్తుందని ఆయన చెప్పారు. ఈ సంస్థ విచారణలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని బొమ్మై చెప్పారు.
విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ కుమార్ బెంగుళూరు వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో చీఫ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నారు. తన తండ్రి తరఫున ఆయన 40 లక్షల ముడుపులు తీసుకున్నట్టు తెలుస్తోంది.