పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం ఉభయ సభలకు రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారని.. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభిస్తే రాజ్యాంగ స్ఫూర్తికి సార్థకత ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఇక కామ్రెడ్ల పై ఆయన ప్రశంసలు కురిపించారు. సమకాలీన రాజకీయాల్లో రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ తగ్గినా, అవినీతి పెరిగినా కమ్యూనిస్ట్ పార్టీలలో మాత్రం సిద్ధాంతాలు, నైతికత అలాగే ఉండిపోయాయని, అందుకే తాను కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఫాలో అవుతానని ఆయన అన్నారు.
అయితే పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో పెద్ద దుమారమే రేగింది. వీర్ సావర్కర్ పుట్టిన రోజైన మే 28న పార్లమెంట్ ప్రారంభోత్సవం చేస్తుండడం పట్ల ముందు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం పై కూడా ఇంకా తీవ్ర స్థాయిలో విపక్షాలు మండిపడుతున్నాయి.
రాజ్యాంగానికి అధిపతి అయిన రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. లోక్ సభ స్పీకర్ చేత ప్రారంభోత్సవం చేపట్టాలని మరికొన్ని విపక్షాలు పట్టుబడుతున్నాయి. మొత్తానికి 19 విపక్ష పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. మరోవైపు ఎన్డీయే కూడా ఈ విషయంలో విపక్షాలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చే పనిలో పడింది.