ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంపై ఇంకా తాము ఎలాంటి నిర్ణయానికీ రాలేదని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎంపీ కే. కేశవ రావు వెల్లడించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. రేపటిలోగా ఓ నిర్ణయానికి వస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రారంభోత్సవానికి వెళ్లే విషయంపై రేపు తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. తాము పార్లమెంట్ భవనం ప్రారంభానికి హాజరు కావడం కుదరక పోవచ్చన్నారు. ఇక పార్లమెంట్ ప్రారంభోత్సవానికి తాము హాజరు కాబోమని ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రకటించాయి.
మొత్తం 19 పార్టీలు ఈ మేరకు ప్రకటన చేశాయి. పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింప చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతికి బదులుగా ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఇక వీర సావర్కర్ జయంతి రోజున ప్రారంభోత్సవం చేస్తున్నారంటూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. బీజేపీ నేతలు ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు. గతంలో పార్లమెంట్ అనుబంధ భవనాన్ని ఇందిరాగాంధీ, పార్లమెంట్ లైబ్రరీ భవనానికి రాజీవ్ గాంధీ శంఖుస్థాపన చేశారని గుర్తు చేస్తున్నారు.