నిన్న ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ సర్కార్ స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అవసరమైన కళ్లద్దాలను ఏఎన్ఎంలు ఇంటికే తెచ్చి ఇస్తారని చెప్పారు. కంటి వెలుగు రెండో విడత ప్రారంభోత్సవం సందర్భంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన పథకాలను ప్రశసించారన్నారు. హైదరాబాద్ అమీర్ పేటలోని వివేకానందా కమ్యూనిటీ హాల్ లో కంటి వెలుగు శిబిరాన్ని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. మన పథకాలను అనేక రాష్ట్రాలు,కేంద్రం అనుసరిస్తున్నాయని చెప్పారు. కంటి వెలుగును పంజాబ్, ఢిల్లీలో అమలు చేస్తామనడం తెలంగాణకు గర్వకారణమని వెల్లడించారు.
నేటి నుంచి రెండో విడత కంటివెలుగు ప్రారంభమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందు కోసం 1500 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు అందజేస్తామన్నారు. కంటి వెలుగు కోసం ఇంతటి భారీ కార్యక్రమం ఎవరూ చేపట్టలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.