ప్రజల పక్షాన పోరాడటమే నేను చేస్తున్న తప్పా.. అని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. సెక్రెటేరియట్ లో ఏదో జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాక్ డ్రిల్ జరిగితే ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. మీ దాడులకు రెట్టింపు స్థాయిలో మీ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారామె. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల… మీ లాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు.
మరోసారి చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండని ఆమె హెచ్చరించారు.గతంలో నర్సం పేటలో తమ బస్సును తగలబెట్టి.. తమపై దాడి చేశారని ఆరోపించారు. నిన్న వర్థన పేటలో ప్రజా ప్రస్థానం యాత్రపై దాడి చేశారని, ఏం జరిగినా తన పాదయాత్రను తిరిగి మొదలుపెట్టానని చెప్పారు.
ఫ్లెక్సీలు చింపి, కవరేజ్ చేస్తున్న మీడియా పై దాడికి యత్నించారన్నారు. ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనపై దాడులు చేస్తారా.. అని ఆమె నిలదీశారు. ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ అని షర్మిల చెప్పారు. ప్రజలు చేస్తున్న ఆరోపణలనే తాను ప్రస్తావించానని, అరూరి రమేష్ రైతులపై థర్డ్ డిగ్రీ చేపించింది నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు. పర్వతగిరి నుంచి మంత్రిగా ఉన్న ఎర్ర బెల్లి గ్రామానికి ఏం చేశారని ఆమె అడిగారు. అప్పుల పాలై సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె అన్నారు. ఎవరు మాట్లాడితే వారి పై కేసులు పెడుతున్నారని, దమ్ముంటే మంచి పాలన అందించండని షర్మిల కేసీఆర్ కు సవాల్ విసిరారు.