దేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఆసియా విస్తృతమైన సేవలు అందించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే బయో ఆసియా సదస్సుపై ఆయన మీడియాతో మాట్లాడారు.
జినోమ్‌వ్యాలీలో ఈనెల 24 నుంచి 26 వరకు బయో ఆసియా సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మరో ఐదేండ్లలో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు రెట్టింపు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి అంతర్జాతీయ ప్రాధాన్యత ఉందన్నారు. ఈ సదస్సులో తొలిసారిగా యాపిల్ కంపెనీ పాల్గొంటోందన్నారు. త్వరలోనే ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు.
జీవ శాస్త్ర రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా రాష్ట్రం మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీవ శాస్త్ర రంగంలో అపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, బయో ఆసియాతోపాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు వచ్చినా ఆదుకునే స్థాయిలో హైదరాబాద్ ఫార్మా సిటీ ఉంటుందని ఆయన తెలిపారు.
ఫార్మాసిటీపై న్యాయస్థానం నుంచి తీర్పు అనుకూలంగా వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మా సిటీకి కేంద్రం నుంచి సాయం అందలేదని కేటీఆర్ ఆక్షేపించారు. కేంద్రం బల్క్ ఔషద పార్క్ ఇవ్వకున్నా, ఫార్మా సిటీకి సాయం చేయకున్నా, ఐటీఐఆర్ రద్దుచేసినా ఆయా రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు.