గొప్ప చరిత్ర గల వరంగల్‌కు 2014లో గ్రహణం పట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీది అని ఆయన అన్నారు. అలాంటి కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు లేవు, ప్రొఫెసర్లు లేని పరిస్థితి నెలకొందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. కొండా దంపతుల మీద కోపంతో వరంగల్‌ను ఈ దండుపాళ్యం ముఠా చెత్త కుప్పగా మార్చిందని మండిపడ్డారు. పౌరుషానికి మారు పేరైన ఈ గడ్డపై బిల్లా రంగా లాంటి ఎమ్మెల్యేలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
వరంగల్‌లో ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అని అడిగారు. వరంగల్‌లో బీఆరెస్ నేతలు భూములు ఆక్రమించుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. అజాం జాహీ మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన భూమిని ఈ ప్రభుత్వం పంపిణీ చేయలేదన్నారు.
కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వరంగల్‌లో ఈ తొమ్మిదేండ్లలో ఏ అభివృద్ధి జరగలేదన్నారు. వరంగల్ అంటే ప్రేమ అంటున్న కేసీఆర్‌కు ఇక్కడి భూములు ఇక్కడి ఆస్తులపైనే ప్రేమ అని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ కు వేయి ఎకరాల ఫామ్ హౌస్, కొడుకుకు 500 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందే తప్ప పేదలకు ఒరిగిందేం లేదన్నారు.
రాష్ట్రంలో ఈ రావణకాష్టానికి పరిష్కారం లేదా? అని ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చిన అన్నోడికి రెండు సార్లు అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు. వరంగల్‌లో కొండా దంపతులను ఆశీర్వదించండని అభ్యర్థించారు.
వైఎస్ హయాంలో వారికి ఎలాంటి గౌరవం దక్కిందో.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆనాడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. ఈనాడు ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు ఇవ్వబోయేది కాంగ్రెస్ అని తెలిపారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వరంగల్ ఈస్ట్ లో సురేఖమ్మ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.