దేశంలో కేటుగాళ్లకు కొదవేం లేదు. టెక్నాలజీకి తగ్గట్టు కొత్త కొత్త ఐడియాలతో మోసాలు, నేరాలకు పాల్పడుతున్న వారు ఎందరో. తాజాగా ముంబైలో వెలుగుచూసిన బుల్లీ బాయ్ యాప్ కూడా అంతే. కావాలనే ఓ వర్గానికి చెందిన మహిళల ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేసి వికృత ఆనందం పొందుతున్నారు. ఎంపీ చతుర్వేది ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది.
ఈ యాప్ లో చాలామంది మహిళల ఫోటోలు ఉన్నాయి. దీనిపై ముంబై పోలీసులకు కంప్లయింట్ కూడా అందింది. అలాగే తన ఫోటోను కూడా అప్ లోడ్ చేశారంటో ఓ జర్నలిస్ట్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారంపై అటు ముంబై, ఇటు ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ఇష్యూపై విచారణ ప్రారంభించారు పోలీసులు.
మరోవైపు ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ పై స్పందించారు కేంద్రమంత్రి వైష్ణవ్. బుల్లీ బాయ్ యాప్, సైట్ ను తొలగించినట్లు వివరించారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. మంత్రి ట్వీట్ పై స్పందించిన ప్రియాంక.. నిందితులను కనిపెట్టాలని కోరారు. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను సేకరించి మార్ఫింగ్ చేసి.. దుండగులు బుల్లీ బాయ్ యాప్ లో పెడుతున్నారని చెప్పారు. కొన్నాళ్ల క్రితం సలీ డీల్స్ పేరుతో ఉన్న యాప్ కూడా ఇదే తరహా కార్యకలాపాలకు పాల్పడింది.