చికోటి ప్రవీణ్ కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈయన కొంతకాలం క్రితం రూ.3 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొన్నారు. అయితే, ఇది బినామీ పేరు మీద కొన్నారని అధికారులు భావిస్తున్నారు. భాటియా ఫర్నిచర్ పేరు మీద కొనాల్సిన అవసరం ఏంటని.. ఆ కారును ఎందుకు సీజ్ చెయ్యకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు.
ఇప్పటికే చీకోటి ఫెమా కేసుతోపాటు క్యాసినో వ్యవహారంలో విచారణను ఎదురుకుంటున్నారు. కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో చికోటి ప్రవీణ్ పేరు మార్మోగుతోంది. ఈడీ సోదాలు నిర్వహించాక.. చికోటి చికటి సామ్రాజ్యం లింకులు బయటపడ్డాయి. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్న ఈయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చి క్యాసినో ప్రోగ్రామ్స్ ను గట్టిగా ప్రమోట్ చేసుకున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనే ఆరోపణలు వినిపించాయి. ఒక చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారిగా తన జీవితాన్ని మొదలు పెట్టిన చికోటి.. సినిమాలంటే ఆసక్తి ఉండడంతో నిర్మాతగా మారారు. కానీ, అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అయితే, వాటి నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్ ను కిడ్నాప్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి జైలుకు సైతం వెళ్లాడు. ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్ లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని నిర్వహించడం మొదలు పెట్టాడు.
తొలినాళ్లలో జంట నగరాల్లో అది కూడా సెలబ్రిటీల కోసమే క్యాసినో నిర్వహించాడు. తర్వాత చిన్నచిన్న పార్టీలు ఇస్తూ తద్వారా పరిచయాలు పెంచుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తరువాత రాజకీయ నేతలతో పరిచయాలు కావడంతో తిరుగులేకుండా పోయింది. చికోటి చీకటి వ్యాపారం రాష్ట్రాల ఎల్లలు దాటి.. ఇతర దేశాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు చికోటి కస్టమర్ల లిస్ట్ లో ఉన్నారనే ప్రచారం ఉంది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్ కు కస్టమర్లను తీసుకెళ్లి కోట్ల రూపాయలతో పేకాట ఆడించే స్థాయికి చేరుకున్నాడు. గతంలో ఈడీ నిర్వహించిన సోదాలతో చికోటి చీకటి సామ్రాజ్యపు పునాదులు కదలడం ప్రారంభించాయి. ఇప్పుడు కాస్ట్లీ కారు విషయంలో ఐటీ నోటీసులు పంపింది.