కర్ణాటకలో ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అవినీతి కేసులో రాజీనామా చేసిన ఘటన మరువక ముందే ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆర్. శంకర్ బాగోతం ఒకటి బయటపడింది. హవేరీ జిల్లా లోని ఈయన ఇల్లు, కార్యాలయం పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిన్న దాడి చేసినప్పుడు గుట్టలుగా చీరలు, కాలేజీ బ్యాగులు, ప్లేట్లు, ఇంకా ప్రెషర్ కుకర్ వంటి వివిధ రకాల గృహోపకరణాలను చూసి వారు ఆశ్చర్యపోయారు. దాదాపు ఆరు వేలకు పైగా చీరలు, 9 వేలకు పైగా స్కూలు, కాలేజీ బ్యాగులను కనుగొన్నామని, ఇవన్నీ దాదాపు 30-40 లక్షల విలువైనవని వారు తెలిపారు.
అన్నింటి మీదా ఆయన ఫోటో ఎంబ్లెమ్ అతికించి ఉందని అధికారులు చెప్పారు. వీటినన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నందున తన నియోజకవర్గంలోని ఓటర్లకు వీటిని పంపిణీ చేసేందుకు ఇప్పటి నుంచే శంకర్ .. వీటిని నిల్వ చేసుకున్నాడని భావిస్తున్నారు. ఐటీ అధికారులు సుమారు ఏడు గంటలపాటు సోదాలు జరిపి ఈ వస్తువులనన్నిటినీ పోలీసులకు అప్పగించారు.
వీటి తాలూకు బిల్లుల గురించి ప్రశ్నించినప్పుడు జీ ఎస్టీ తో సహా అన్ని బిల్లులు తనవద్ద ఉన్నాయని, త్వరలో వాటిని అందజేస్తానని శంకర్ చెప్పారట. ఈయన గతంలో కూడా ఓటర్లకు ప్రెషర్ కుకర్లు తదితరాలను పంపిణీ చేశాడని తెలుస్తోంది. ఐటీ దాడులకు నిరసనగా ఈయన మద్దతుదారులు అక్కడ చాలాసేపు ధర్నాకు కూర్చున్నారు.
తమ నేత 2012 లో కూడా ప్రజలకు ఇలా సహాయం చేశాడని, ఆయన చట్టవిరుద్ధమైన పనులేవీ చేయడం లేదని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ దాడులకు తాను సహకరించానని శంకర్ చెబుతూనే.. ఎవరో కుట్ర చేసి ఇందుకు ప్రేరేపించారని ఆరోపించారు. ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ని ఇంకా ఈసీ ప్రకటించలేదని, అందువల్ల ఈ దాడుల్లో అర్థం లేదని ఆయన వాదించాడు.